- నాలుగున్నర దశాబ్దాల తర్వాత ములుగు జిల్లా నర్సింగాపూర్‌కు వెళ్లిన వాసుదేవరావు
- మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్ వారే : ఆశన్న
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగుబాటు తర్వాత బుధవారం తన సొంత గ్రామమైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ చేరుకున్నారు.
ఆశన్న 45 ఏండ్ల తర్వాత సొంతూరికి చేరుకోవడంతో బాల్యమిత్రులు, బంధువులు, గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. నాలుగున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి గ్రామంలో అడుగుపెట్టిన ఆశన్నను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆశన్న మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్ వార్ పార్టీయేనని చెప్పారు.
నర్సింగాపూర్ గ్రామానికి వస్తానని ఊహించలేదన్నారు. తన అమ్మమ్మ గ్రామమైన రాంపూర్‌లోని భూస్వాములు, అగ్రకుల వాతావరణం వంటి ఘటనలు ఆలోచింపజేశాయన్నారు. అప్పట్లో చెన్నారెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం చేయడం వంటి ఘటనలతో ఉద్యమంలోకి వెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుత యువతరం సంఘటితంగా ఆలోచించి అనుకున్నది సాధించాలని సూచించారు.
సమాజ మార్పు కోసం అందరితో కలిసి ముందుకు వెళ్తానన్నారు. కార్యక్రమంలో జల వనరుల సంస్థ మాజీ చైర్‌పర్సన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి గోపాల్‌రావు, గ్రామస్తులు సూర్యనేని మురళీధర్‌రావు, తౌట్‌రెడ్డి మల్లారెడ్డి, భాస్కరరావు, ఎర్రబెల్లి సుధాకర్‌రావు, గొర్రె ఓదెలు, అల్లం, ఓదెలు యాదవ్, కొమురయ్య, రేపాల సత్యనారాయణ పాల్గొన్నారు.
